- దళిత వర్గానికి చెందిన స్పీకర్ కు గౌరవం ఇవ్వడం లేదన్న సీతక్క
- సబితను తోసింది ఎవరో విజువల్స్ చూస్తే తెలుస్తుందన్న మంత్రి
- మహిళా పోలీసు అధికారులపై బీఆర్ఎస్ నేతలు దుర్బాషలాడిన దృశ్యాలు రికార్డయ్యాయని వెల్లడి
శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అత్యంత హేయమైన, అనుచిత వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు ఏమీ ఎరుగనట్లు తప్పించుకోవాలని చూస్తున్నారని పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ నేతల తీరును ఎండగడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
“సభలో దళిత వర్గానికి చెందిన స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వకపోగా, గతంలో ఎప్పుడో మరణించిన ఆయన మాతృమూర్తిని ఉద్దేశించి అంత నికృష్టమైన భాష మాట్లాడటం ఏ రకమైన సంస్కారం?” అని నిలదీస్తూ కంటతడి పెట్టారు. సీతక్క ఆవేదన చూసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సభలోనే కన్నీళ్లు పెట్టుకోవడంతో వాతావరణం అత్యంత గంభీరంగా మారింది.
సభలో ప్రతిపక్ష నేతల తీరుపై మండిపడ్డ సీతక్క… “సబితా ఇంద్రారెడ్డిని నిజంగా తోసింది ఎవరో విజువల్స్ చూస్తే తెలుస్తుంది. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రావడం ఏంటి? హరీశ్ రావు మహిళల ముందు బట్టలు విప్పుతారా?” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “మహిళా ప్రజాప్రతినిధులను సురక్షిత ప్రాంతానికి పంపి, ఆ తర్వాత పురుష నేతలు నిరసనకు రావడం పద్ధతి. కానీ మహిళలను అడ్డుగా పెట్టుకుని రాజకీయం చేయడం దారుణం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉన్న మహిళా పోలీస్ అధికారులపై బీఆర్ఎస్ నేతలు చేయిచేసుకుని, దుర్భాషలాడిన దృశ్యాలు రికార్డయ్యాయని, చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులను కొట్టిన ఎమ్మెల్యేలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టసభలు దేవాలయం లాంటివని, బీఆర్‌ఎస్ మహిళా నేతలు ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. “సొంత చెల్లెలు కవితను పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు లేని బాధ, హరీశ్ రావును ఏదైనా అంటే ఎందుకు వస్తోంది?” అని సీతక్క బీఆర్‌ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు.