హైదరాబాద్ : మెట్రో న్యూస్
కేబినెట్ విస్తరణపై టీపీసీసీ మహేశ్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడారు
ప్రస్తుతానికి మార్పులు, చేర్పులకు దసరా వరకు బ్రేక్ ఉందని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు పదవుల పై ఆశలు పెట్టుకున్న నాయకులను నిరాశ పర్చాయి. దసరా వరకు కేబినెట్ విస్తరణ ఉండదని ఆయన వెల్లడించడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేల్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. కేబినెట్ విస్తరణపై అధిష్ఠానం, ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ.. తుది నిర్ణయానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రివర్గంలో చోటు కోసం పలువురు ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతో పాటు సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలు, భవిష్యత్ రాజకీయ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉండటంతో విస్తరణ అంశం పదేపదే వాయిదా పడుతూ వస్తోంది. గతంలోనూ మహేశ్‌గౌడ్ కేబినెట్ విస్తరణపై వివిధ సమీకరణాల కారణంగానే జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే ప్రక్రియ నేపథ్యంలో కేబినెట్ కూర్పు అంశం మరింత కీలకంగా మారింది. పార్టీ క్రమశిక్షణ అంశంపై కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన వైఖరి తీసుకున్న నేపథ్యంలో, తదుపరి మంత్రివర్గ కూర్పులో ఎవరికి అవకాశం ఇవ్వాలి? ఎవరిని కొనసాగించాలి? అనే అంశాలపై అధిష్ఠానం స్థాయిలో చర్చలు జరిగే అవకాశం ఉంది. కేబినెట్లో బీసీ వర్గాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్ కూడా కాంగ్రెస్‌లో బలంగా వినిపిస్తోంది. బీసీలకు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని కోరడంలో తప్పులేదని మహేశ్‌గౌడ్ గతంలోనే వ్యాఖ్యానించారు. దీంతో తదుపరి కేబినెట్ కూర్పులో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.
మహేశ్‌గౌడ్ తాజా వ్యాఖ్యలతో దసరా వరకు కేబినెట్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతవరకు పార్టీ అంతర్గత సమస్యలను చక్కదిద్దడం, ఆశావహులపై సమీక్ష, సామాజిక సమీకరణాలపై కసరత్తు జరిగే అవకాశం ఉంది.మొత్తంగా.. కేబినెట్ విస్తరణపై ఆశలు పెట్టుకున్న వారికి మరోసారి నిరీక్షణ తప్పడం లేదు. దసరా తర్వాతే అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందా లేక అనూహ్యంగా ముందే మార్పులు చేపడుతుందా అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.