Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో మీడియాతో మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

0 10
  • డిప్యూటీ సీఎం భార్య‌… క‌మిష‌న్ అడుగుతున్నా చ‌ర్య‌లేవి..?
  • నాపై చ‌ర్య తీసుకుంటే…సీఎంపైనా తీసుకోవాలి
  • ఢిల్లీలో మీడియాతో మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఢిల్లీ (మెట్రో న్యూస్‌):

అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొన్న వేళ‌… మంత్రి కొండా సురేఖ గేరు మార్చారు. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ఉంటూ.. హైక‌మాండ్‌ పెద్ద‌ల‌ను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన ఆమె… త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. త‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంటే… ముఖ్య‌మంత్రిపైనా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప‌దేళ్లు త‌నే సీఎం అని ప్ర‌క‌టించడం క్ర‌మ‌శిక్ష‌ణ రాహిత్యం కాదా అని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రిపై చాలా మంది మంత్రులు, నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌లువురు మంత్రుల‌ను వ‌దిలిపెట్టి… త‌న‌పై చ‌ర్య‌ల‌కు ప‌ట్టుబ‌ట్ట‌డం ఏమిట‌న్నారు. డిప్యూటీ సీఎం స‌తీమ‌ణి బిల్లులు క్లియ‌ర్ చేయ‌డానికి 10 శాతం క‌మిష‌న్ అడుగుతున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. స్వతంత్రంగా జీవిస్తున్న సుస్మిత వ్యాఖ్య‌ల‌కు త‌న‌ను బాధ్యురాలిని చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజసం అన్నారు. అయితే ఇప్పటివ‌ర‌కు త‌న‌ను రాజీనామా చేయ‌మ‌ని అధిష్టానం అడ‌గ‌లేద‌ని… ఒక‌వేళ ముఖ్య‌మంత్రి ఒత్తిడికి త‌లొగ్గితే… బ‌ర్త‌ర‌ఫ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. బుధ‌వారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖ‌ర్గేను క‌లిసిన అనంత‌రం ఆమె ఢిల్లీ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంద‌రో నాయ‌కులు అస‌మ్మ‌తి, అసంతృప్తులు వ్య‌క్తం చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీసీల‌కు ఒక న్యాయం.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు మ‌రో న్యాయ‌మా అని అడిగారు. త‌న‌మీద ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ కొంద‌రు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంత‌ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని… వారికి ఎందుకు నోటీసులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. పెద్ద‌ల ఒత్తిడికి కొంద‌రు ఎమ్మెల్యేలు అయిష్టంగానే మీడియా ముందుకు వ‌చ్చార‌న్నారు. దీనివెన‌క ఎవ‌రి హ‌స్తం ఉందో త‌న‌కు తెలుస‌న్నారు. తాను చెప్పాల్సిందంతా రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి నట‌రాజ‌న్‌కు తెలియ‌జేశాన‌ని తెలిపారు. అలాగే పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లిసి అన్ని విష‌యాలు మ‌రోసారి విన్న‌వించిన‌ట్టు చెప్పారు. ఏఐసీసీ స‌భ్యురాలి హోదాలో ఉన్నా కాబ‌ట్టి… పార్టీ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ త‌దిత‌రుల‌కు రాత‌పూర్వ‌కంగా వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్టు కొండా సురేఖ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.