Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ భూముల పరిరక్షణే 22ఏ ప్రధాన లక్ష్యం: పొంగులేటి

0 17
Ponguleti Srinivas Reddy key announcement on 22A lands and allegations against BRS
  • 22ఏపై ప్రతిపక్షాలది దుష్ప్రచారమన్న మంత్రి పొంగులేటి
  • ప్రజలు ఆందోళన చెందవద్దని సూచన 
  • నకిలీ పత్రాలతో భూకబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా భూ అక్రమాలు జరిగాయని ఆరోపణ
  • రిజిస్ట్రేషన్లు పూర్తికాని వారికి వారాంతంలోగా ఫీజులు వాపసు చేస్తామని హామీ

22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు, చట్టబద్ధమైన ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కల్పించడమే 22ఏ ప్రాథమిక ఉద్దేశమని వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నకిలీ జీవోలు, మెమోలు, సర్టిఫికెట్లతో భారీ ఎత్తున భూదందాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం రికార్డులను ప్రక్షాళన చేస్తూ, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మంత్రి కొన్ని ఉదాహరణలను ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో సర్వే నంబర్ 172లోని ప్రభుత్వ భూమిని, సర్వే నంబర్ 173గా చూపి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండాల్సి ఉండగా, గతంలో ముఖ్యమంత్రితో పాటు తన నివాసాలు ఉన్న మొత్తం 1280 ఎకరాలను 22ఏ కింద చేర్చారని, అనంతరం ఆ పొరపాటును సరిదిద్దామని పేర్కొన్నారు. అలాగే మెదక్ జిల్లాలో 522 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద సీఎస్-7, సీఎస్-14 భూముల వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని, ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తే సిట్టింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (సెట్) విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సవాల్ విసిరారు. 22ఏ టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చిన 980 ఫిర్యాదుల్లో 98 శాతం పరిష్కరించామని, సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు పూర్తికాని వారికి ఈ వారాంతంలోగా ఫీజులు వాపసు చేస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.