Take a fresh look at your lifestyle.

నా టార్గెట్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ కాదు: కొండా సుష్మిత

0 12
My target is CM Revanth Reddy not party says Konda Susmita
  • సోనియా, రాహుల్‌, ప్రియాంకపై గౌరవం ఉందన్న సుష్మిత
  • రేవంత్‌, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపణ
  • ‘టికెట్‌ నిర్ణయించడానికి సీఎం ఎవరు?’ అని ప్రశ్న
  • స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటన
  • పరకాల నుంచి పోటీ చేయడం ఖాయమని వెల్లడి

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కుమార్తె వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సురేఖ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో కొండా సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సీఎం రేవంత్‌ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు.

‘‘సీఎం రేవంత్‌ రెడ్డి పరకాల వచ్చి రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు. నేను రేవంత్‌ రెడ్డిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేశాను. పార్టీని కాదు. నాకు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్‌పై చాలా గౌరవం ఉంది. కానీ, రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోంది. అందుకే వారిని టార్గెట్‌ చేసుకున్నాను. పైగా ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికివ్వాలో నిర్ణయించడానికి ఆయన ఎవరు? సీడబ్ల్యూసీ సమావేశాల వంటి వ్యవస్థ ఉంది కదా. ఆ ప్రకారంగానే అభ్యర్థులను ప్రకటిస్తారు. నేను అదే ప్రశ్నించాను. నేను స్వతంత్రగా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’’ అని కొండా సుష్మిత ఓ జాతీయ మీడియా  ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమంటూ గీసుకొండలో బుధవారం సుష్మిత అన్న విషయం తెలిసిందే. ఇటీవల పరకాల బహిరంగ సభలో ‘వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అలా ఏకపక్షంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. సీఎం సోదరుడు పెట్టిన డొల్ల కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని.. తన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇప్పించేందుకు ప్రయత్నిస్తే సీఎం కుటుంబం అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడతానన్నారు.

Leave A Reply

Your email address will not be published.