భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో పాటు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేశ్ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను శాలువాతో సత్కరించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు.

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరగనున్న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవ (రూబీ జూబ్లీ) వేడుకల్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు.