Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద శుద్ధి.. అసెంబ్లీలో తీవ్ర దుమారం

0 3
  • నిన్న కేసీఆర్ ఫాంహౌస్ వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎస్సీ విభాగం, దళిత సంఘాలు
  • ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేశారన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • దళితుల పట్ల వివక్షను బీఆర్ఎస్ మరోసారి నిరూపించుకుందని మండిపాటు

తెలంగాణ శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే సభలో తీవ్ర దుమారం చెలరేగింది. నిన్న సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌ వద్ద కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు, దళిత సంఘాలు నిరసన తెలిపిన అనంతరం… బీఆర్‌ఎస్ నేతలు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేశారంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు నిరసన తెలిపి వెళ్లిన స్థలాన్ని శుద్ధి చేయడం వెనుక బీఆర్‌ఎస్ నాయకుల తీవ్రమైన కులతత్వం బయటపడిందని… ఇది యావత్ దళిత సమాజ ఆత్మగౌరవాన్ని, హక్కులను తీవ్రంగా అవమానించడమేనని విమర్శించారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను అసెంబ్లీ గేటు వద్ద బూతులు తిట్టిన అంశాన్ని మరిచిపోకముందే… బీఆర్‌ఎస్ మరోసారి దళితుల పట్ల తమకున్న వివక్షను నిరూపించుకుందని మండిపడ్డారు. ఈ శుద్ధి వ్యవహారంపై సభలో సమగ్ర చర్చ జరగాలని ఆయన పట్టుబట్టారు.

మరోవైపు, మంత్రి ప్రసంగానికి అడ్డుతగులుతూ బీఆర్‌ఎస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై, వారిపై జరిగిన అనుచిత ప్రవర్తనపై ప్రభుత్వం తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఇరువైపులా నేతల పోటాపోటీ నినాదాలు, హంగామాతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.