Take a fresh look at your lifestyle.

Volkswagen | ఫోక్స్‌వ్యాగన్‌లో భారీగా ఉద్యోగాల కోత.. లక్ష మందిని తీసేస్తామని ప్రకటన

0 11

Volkswagen | జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ భారీగా ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని వెల్లడించింది.

Volkswagen | జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ భారీగా ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయించినట్లుగా ప్రకటించింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని వెల్లడించారు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక అంగీకారానికి వచ్చాయని పేర్కొంది. ఇందులో ఇప్పటికే 50 వేల ఉద్యోగాల కోతకు అంగీకరించగా.. తాజాగా మరో 50 వేల పోస్టులను తొలగించేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పింది. కాగా, కంపెనీ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ఆటోమొబైల్‌ రంగంలోనే ఇది అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా నిలవనుంది.

కంపెనీ ఆర్థికపరమైన అంశాలకు తగినట్లుగా ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించడం తప్పనిసరని ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. అమెరికా సుంకాలు, ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా చైనాకు చెందిన సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా యూరప్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే లేఆఫ్స్‌‌కు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో దాదాపు 6.67 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒక్క జర్మనీలోని దాదాపు 43 శాతం మంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్ష ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించింది. అంటే మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతానికి సమానం అన్నమాట. ఈ ఉద్యోగాల కోతను కార్మిక సంఘాలు వ్యతిరేకించినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా ప్రకటనలో మాత్రం కార్మిక సంఘాలు కూడా అంగీకరించినట్లు తెలపడం గమనార్హం.

కాగా, హ్యానోవర్‌, ఎమ్డెన్‌, జ్వికావ్‌, నెకార్సుల్మ్‌లోని నాలుగు జర్మన్‌ ప్లాంట్ల దీర్ఘకాలిక భవిష్యత్తుపై స్పష్టత లేదని కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్లాంట్లకు ప్రత్యామ్నాయ వినియోగ మార్గాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి స్థాయి ప్లాంట్లను జర్మనీలో మూసివేయడం వోక్స్‌వ్యాగన్‌కు ఇదే తొలిసారి కానుందని కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే ప్లాంట్ల మూసివేతకు ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఐజీ మెటల్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. కార్మికులు, లోయర్‌ సాక్సనీ రాష్ట్రంతో కలిసి చర్చల ద్వారా రాజీ కుదిరిందని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.