Take a fresh look at your lifestyle.

హుష్‌… గ‌ప్‌చుప్‌!

0 12
  • ఢిల్లీలో హాట్‌హాట్‌గా తెలంగాణ టాక్స్‌
  • కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ వివ‌ర‌ణతో కొండా సురేఖ రెడీ…
  • రాష్ట్ర సీనియ‌ర్ల‌తో నేడు కూడా ఏఐసీసీ నేతల చ‌ర్చ‌లు

(మెట్రో న్యూస్ బ్యూరో):

దేశ రాజ‌ధాని ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల హ‌డావిడి రాజ‌కీయ వేడిని ర‌గిలిస్తోంది. మంగ‌ళ‌వారం ఢిల్లీకి చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌తో స‌మావేశమ‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌ను కాంగ్రెస్ సంస్థాగ‌త వ్య‌వ‌హారాల ఇంఛార్జ్‌కు వివ‌రించారు. ఖ‌చ్చితంగా మంత్రి కొండా సురేఖ అంశం కూడా ప్ర‌స్తావించారు. ఇటీవ‌ల మంత్రితోపాటుగా మాజీ మంత్రి చిన్నారెడ్డి అస‌మ్మ‌తి రాగం, ఇత‌ర నాయ‌కుల అసంతృప్తుల‌నూ ప‌నిలోప‌నిగా కేసీ చెవిలో వేశారు. వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ సిఫారసుల గురించీ మాట్లాడారు. వారి వ్యాఖ్య‌లు… వైఖ‌రి వ‌ల్ల పార్టీకి ఎంత న‌ష్టం జ‌రిగిందో సీఎం పూస‌గుచ్చిన‌ట్టు చెప్పార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే సీఎం త‌న కాన్వాయ్‌తో కాకుండా… ఒంట‌రిగా ఒక్క కారులోనే కేసీతో భేటీకి వెళ్ల‌డం మీడియాలో హైలైట్ అయ్యింది.

హైక‌మాండ్ పెద్ద‌ల‌కు త‌న వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి మ‌రోవైపు మంత్రి కొండా సురేఖ కూడా మంగ‌ళ‌వార‌మే ఢిల్లీ చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇదివ‌ర‌కే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లిసి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన మంత్రి… ఇపుడు కేసీ వేణుగోపాల్‌ను క‌లవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆమెకు అపాయింట్‌మెంట్ ఖరార‌వ్వ‌డంతో… నిర్ణ‌యం తీసుకునేముందు ఆమె వివ‌ర‌ణ కూడా తెలుసుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇక బుధ‌వారం నాడు పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, సీనియ‌ర్ మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు త‌దిత‌రులు ఢిల్లీలో హైక‌మాండ్‌తో చ‌ర్చ‌ల‌కు అందుబాటులో ఉంటారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అవార్డుల కార్య‌క్ర‌మంతోపాటుగా… ఏఐసీసీ అగ్ర‌నేత‌ల‌తో మరో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బుధ‌వారం రాహుల్ గాంధీ, ఖ‌ర్గేల‌తో రెండో రౌండ్ చ‌ర్చ‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి బుధ‌వారం తెలంగాణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్నదనేది ఖాయంగా క‌నిపిస్తోంది!

Leave A Reply

Your email address will not be published.